Sunday, 20 October 2013

'బంగారు' రాజు కథ



నెత్తురు అంటిన నిధి చరిత
తెల్లదొరలపై ఎత్తిన తిరుగుబాటు పతాక
కాన్పూర్‌లో సిపాయిల విజయోత్సాహం
బ్రిటిష్ కుటుంబాల ఊచకోత
ఇది కాన్పూర్ రాజు రామ్‌బక్ష్ పనేనని అనుమానించిన అధికారులు
పట్టుకొని ఉరితీత
సంపన్న స్వదేశీ రాజుల్లో రామ్‌బక్ష్ ఒకరు
చనిపోవడానికి ముందు కోటలో సంపద దాచిన ట్టు ప్రచారం
నిధి కోసం గతంలోనే వారసుల ప్రయత్నం



నిధి కోసం తవ్వుతుంటే గతం బయటపడింది. బంగారం కోసం భూగర్భం నుంచి మట్టిని బయటకు పోస్తుంటే, చరిత్ర వెలికి వచ్చింది. తొలితరం స్వేచ్ఛాప్రియులు, వీరాధివీరులైన యోధుల గాథ జాతి స్మరణలో మెరిసింది. సాధువు కల నిజమయినా కాకపోయినా..ఉజ్వల 1857 తిరుగుబాటుకు, తెల్లదొరలపై పిడికిళ్లు బిగించిన స్వదేశీ రాజుల ధిక్కారానికి, ఉరికొయ్యలకు వేలాడిన వారి దేశభక్తికి తార్కాణంగా నిలిచిన కాన్పూర్ కోట ప్రాంతాన్ని మాత్రం ఇన్నాళ్లకు ఈ ఉదంతం చర్చలోకి తెచ్చింది.


ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లాలో వెయ్యి టన్నుల బంగారం కోసం జరుగుతున్న తవ్వకాల వెనక పెద్ద చరిత్రే ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటులో అనేక మంది స్థానిక రాజులు బ్రిటీష్‌వారిపై తిరగబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ తిరుగుబాటు ప్రభావం ఎక్కువగా కన్పించింది. కొన్ని ప్రాంతాల్లో బ్రిటీష్‌వారిని స్థానిక రాజులు ఓడించారు. ఉత్తరప్రదేశ్‌లో సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన వివరాలను 1940ల్లో అమృత్‌లాల్ నాగర్ అనే రచయిత - 'గద్దర్ కే ఫూల్' అనే పుస్తకంలో వివరించారు.


తెల్లదొరల ఊచకోత

తిరుగుబాటుకు కేంద్ర స్థానమైన కాన్పూర్‌లో బ్రిటీష్ సైన్యాలు ఓడిపోయాయి. 1857 జూన్ 4వ తేదీన ఓటమిపాలైన బ్రిటీష్ వారంతా వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు. ఈ క్రమంలో దాదాపు 40 బోట్లలో సైనికులు, వారి కుటుంబాలు దాండియా ప్రాంతానికి తలదాచుకోవటానికి వచ్చాయి. అప్పట్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అడవిలా ఉండేది. అప్పటికే అలసిపోయిన కుటుంబాలకు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. దీంతో సమీపంలోని శివాలయంలో తలదాచుకున్నారు. అక్కడ ఉన్న విగ్రహాలను, శివలింగాన్ని బయట పడేశారు. ఆలయంలో చప్పుళ్లు కావటంతో ఊరిజనం గుంపుగా శివాలయం దగ్గరకు వచ్చారు. వారిని చెదరగొట్టడానికి బ్రిటిష్ సైనికులు గాలిలో తుపాకులు పేల్చారు. ఈ కాల్పుల్లో కొందరు మరణించారు. ఈ క్రమంలో ప్రజలు తిరగబడ్డారు. ఆ సమయంలో గుడిలో 40 కుటుంబాలు తలదాచుకోగా, సర్ మోబెర్రి, డెలాఫోసి, మర్ఫి, సువిలన్ అనే నలుగురు ఆంగ్లేయులు మాత్రమే బతికి బయటపడ్డారు. వీరందరూ తిరిగి కాన్పూర్ సైనిక శిబిరానికి పారిపోయారు. విషయం తెలుసుకొన్న బ్రిటిషిండియా ప్రభుత్వం.. జనరల్ హోప్ గ్రాంట్ నేతృత్వంలో సైనిక బలగాలను దాండియా ఖేదాకు పంపారు.


రాజా రామ్‌బక్ష్ ఉరితీత

దాండియా ఖేదాపై పన్నులు వసూలు చేసే అధికారం రాజా రామ్‌బక్ష్ సింగ్ ఆధీనంలో ఉండేది. రాజాకు కాన్పూర్‌లో ఒక నగల దుకాణం కూడా ఉండేది. అతని వద్ద అపారమైన బంగారం నిల్వలు ఉన్నాయని అందరూ చెప్పుకొనేవారు. బ్రిటిష్ సైనికులు, వారి కుటుంబాల ఊచకోతలో రాజా ప్రమేయం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. కానీ సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్ అధికారులు- స్థానిక రాజాలకు గుణపాఠం నేర్పాలని భావించారు. రామ్‌బక్ష్‌ను పట్టుకోవటానికి సైన్యాలను పంపారు. సైనికులు రామ్‌బక్ష్ కోటను చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకొని.. రామ్‌బక్ష్ ఓ గ్రామంలో దాక్కున్నారు. దాదాపు ఐదు నెలల పాటు ఆ ఊరిజనం అండతో అక్కడే ఉన్నారు. ఈ విషయంలో బ్రిటిష్ వారికి సహకరించేందుకు ప్రజలు అంగీకరించలేదు. దీంతో, పక్క గ్రామం నుంచి ఇద్దరిని తీసుకువచ్చి- రామ్‌బక్ష్‌ను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. బ్రిటిష్ సైనికులు చనిపోయిన శివాలయం వద్దకు తీసుకొచ్చి.. రామ్‌బక్ష్‌ని, అతని సేవకుడిని ఉరితీశారు. ఈ మరణ వార ్త తెలిసిన వెంటనే అతని ఇద్దరు కుమార్తెలు నదిలోకి దూకి చనిపోయారు. బ్రిటిష్ సైనికుల మరణాలు, రాజా ఉరి- బ్రిటిష్ వారు తమ రికార్డుల్లో నమోదు చేశారు. అయితే వీటిలో రాజా సంపదకు సంబంధించిన వివరాలేమి లేవు. దీనిపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బ్రిటిష్ వారి నుంచి తప్పించుకోవటం కష్టమని తెలిసిన రాజా..తన సంపదనంతా కోటలో పాతిపెట్టాడనే వదంతులు ప్రచారంలో ఉండేది. ఈ సంపదను తవ్వి తీయటానికి ఆయన వారసులు చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. శనివారం కోటలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో- ఆయన వారసుడు రావు చండీ సింగ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. బంగారం కోసం గతంలో ఒకసారి తవ్వకాలు జరపటానికి ప్రయత్నించగా, తేనెటీగలు కమ్ముకోవటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నామని ఆయన చెబుతున్నారు.


100 టన్నులు దొరక్కపోవచ్చు
దిద్దుబాటలో ప్రభుత్వం..సాధువు చెబితే కాదు
మా నివేదికల ఆధారంగానే.. జీఎస్ఐ,కేంద్రం వెల్లడి


దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన 1000 టన్నుల బంగారం అన్వేషణపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు కన్పిస్తోంది. అందులో భాగంగా ఉన్నవ్ కోటలో 1000 టన్నుల బంగారం దొరక్కపోవచ్చని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరోవైపు 'బంగారం కోసం మేం అన్వేషించడం లేదు, పురావస్తు ఆనవాళ్ల కోసం పరిశోధన చేస్తు న్నాం' అని భారత పురావస్తు శాఖ డైరక్టర్(ఎక్స్‌ప్లోరేషన్) సయ్యద్ జమాల్ హస న్ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ దాండియా ఖేరా గ్రామంలోని ఉన్నవ్ కోట (రాజారావ్ రాంభక్ష్ కోట)లో తవ్వకాలను ఓ సాధువుకు వచ్చిన కల ఆధారంగా చేపట్టారన్న వాదనలో వాస్తవం లేదని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శనివారం ప్రకటించింది. మరోవైపు అక్టోబర్ 3, 4 తేదీల్లో కోటలో 12 మంది సభ్యుల కమిటీ జరిపిన ప్రాథమిక పరీక్షల ఫలితాల ఆధారంగానే తవ్వకాలు జరుపుతున్నామని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం కోటలో రెండో రోజూ తవ్వకాలు కొనసాగాయి. తవ్వకాలు జరుపుతున్న బృందానికి మిశ్రా నాయకత్వం వహిస్తున్నారు.


ఆర్‌బిఐ, ఆర్థిక శాఖకు పండగే


ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లా దాండియాఖేరా గ్రామం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ ఊరిలోని రాజకోటలో 1,000 టన్నుల బంగారం ఉందని ఓ సాధువు చెప్పడంతో అధికారులు రంగంలోకి దిగి బంగారాన్ని వెలికితీసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సాధువు చెప్పినట్టుగా బంగారం దొరికితే భారత్ పంట పండినట్టేనని కొందరంటున్నారు. పసిడి వెలికితీత కోసం మన అధికారులు చేస్తున్న హడావుడి దేశంలోని వారినే కాకుండా విదేశాల్లోని వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ సాధువు మాటలు నమ్మి తవ్వకాలు మొదలు పెట్టడం ఏమిటని కొందరు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. ఆయన మాటలే బంగారు మూటలైతే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి అని మరికొంత కలల్లో తేలిపోతున్నారు. ఏమైనా అసలు 'విషయం' తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి. సుడితిరిగి 1,000 టన్నుల బంగారమే దొరికితే... క్యాడ్ కట్టడికి, రూపాయిని బలపరచడానికి, ప్రభుత్వ కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు పడుతున్న కష్టాలు తీరే అవకాశం ఉంటుందంటున్నారు. ఆశపెడుతున్న బంగారం దొరికితే భారత్‌లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం.


రాజకోట గర్భంలో బంగారం దొరికితే మొట్టమొదటగా సంబరాలు చేసుకునేది మన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌లే. భారత్‌లోని జనాలు బంగారం అంటే పడి చస్తారని ప్రపంచవ్యాప్తంగా తెలుసు. మన జనాలు వేలం వెర్రిగా బంగారం కొనడం వల్లనే అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడానికి ఒక కారణమని కూడా కొందరు చెబుతారు. దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) పెరగడానికి బంగారమే కారణమని సర్కారు గుర్తించి ఈ లోహం దిగుమతులను కట్టడి చేయడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా రెండుమూడుసార్లు పసిడి పై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఆర్‌బిఐ తన వంతుగా బంగారం కొనుగోళ్లకు రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులకు హుకుం జారీ చేసింది. నాణాలు విక్రయించడం కూడా మానేయాలని ఆదేశించింది. వజ్రాభరణాల దుకాణాల్లో కూడా నాణాల అమ్మకాలపై ఆంక్షలు విధించారు. ఫలితంగా బంగారం వినియోగం తగ్గి కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పడుతుందని భావించారు. ఈ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలించలేదనే చెప్పాలి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఘోరంగా బలహీనపడటానికి కూడా బంగారమే కారణమైనట్టు సర్కారు పెద్దలు చెబుతున్నారు. రూపాయి క్షీణత ఎన్నో రకాల వస్తూత్పత్తుల ధరలు భారీ స్థాయిలో పెరగడానికి దారితీసింది. ఫలితంగా జనాల జేబులు గుల్లయిపోయాయి. స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనై ఇన్వెస్టర్లను రోడ్డున పడేశాయి. ఇలాంటి విపరీత పరిణామాలకు బంగారమే కారణమని చెప్పకతప్పని పరిస్థితి. ఈ బంగారమే ఇప్పుడు టన్నుల కొద్ది దొరికి భారత్ ను బాధల నుంచి విముక్తి చేస్తుందా.. వేచిచూడాలి.


ఆ బంగారమే దొరికితే.. భారత్‌లో పరిస్థితి ఇలా ఉండొచ్చు?

-వెయ్యి టన్నుల బంగారం విలువ ఎంత ఉంటుందో ఇప్పటికే మన ఆర్థిక మం త్రి చిదంబరం లెక్కలు వేసినట్టు తెలుస్తోంది. ఎంత తక్కువ అయినా ఇంత బంగారానికి కనీసం 3,00,000 కోట్ల రూపాయలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బంగారం చేతికి అందితే కొత్తగా బంగారం కొనుగోలు చేసేందుకు డాలర్లను పోగు చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. దీని మూలంగా మన రూపాయి బలపడుతుంది. ఎంతలా అంటే.. డాలర్ మారకంలో రూపాయి విలువ 50 స్థాయికి చేరవచ్చు.

-వెయ్యి టన్నులను విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని కనీసం రెండేళ్లపాటు ఆహార భద్రతా బిల్లు కోసం వినియోగించవచ్చు.

-నిధుల సమీకరణ కోసం ప్రభుత్వరంగంలోని కంపెనీల్లో వాటాలను అమ్మేయాల్సిన పరిస్థితి నుంచి బయటపడవచ్చు. పలు ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నానాకష్టాలు పడుతోంది. తిమ్మినిబమ్మి చేసినా లక్ష్యం నెరవేరే అవకాశాలు కానరావడం లేదు. ఇలాంటి తరుణంలో టన్నుల కొద్ది పసిడి చేతికి అందితే సంబరాలకు అంతే ఉండదు.

-బంగారం అమ్మితే వచ్చే మొత్తంతో దేశ విత్త లోటును సగానికి సగం తగ్గించవచ్చు. దీంతో జిడిపిలో విత్త లోటు 2.4 శాతానికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విత్త లోటును 4.8 శాతానికి కట్టడి చేసేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. అయి నా ఈ లక్ష్యం చేరే అవకాశం లేదనట్టే కనిపిస్తోంది.

- ఏటా వ్యక్తుల దగ్గరి నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్ను కన్నా 50 శాతం అధికంగా బంగారం విక్రయిస్తే వస్తుంది. కాబట్టి ఆర్థిక మంత్రి పన్ను చెల్లింపుదారులపై దయతలచి ఒక సంవత్సరం పన్ను హాలీడే ప్రకటించే అవకాశం కూడా ఉంటుందని వేతన జీవులు ఆశిస్తున్నారు.

-భారత్ పోయిన ఏడాది 860 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఏడాది ఇంతకన్నా ఎక్కువ బంగారం దిగుమతి అయింది. ఒకవేళ వెయ్యి బంగారమే దొరికితే మరో ఏడాదిపాటు తులం బంగారం కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

-బంగారం వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా భారత్ నిలుస్తోంది. ఏడాదిపాటు ఈ దేశం బంగారం కొనకపోతే విదేశీ మార్కెట్లు వెలవెలబోయే అవకాశం ఉంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చే అవకాశం లేకపోలేదు.

ఆధారం : http://www.andhrajyothy.com/node/12201#sthash.rBCL6bue.dpuf

No comments:

Post a Comment